మా ఊరు

పుట్టి పెరిగిన ఊరు కన్న తల్లితో సమానం అంటారు. ప్రపంచంలో ఏ మూల వున్నా మన అమ్మని ఎలా మరిచిపోలేమో, సొంత ఊరును కూడా అలానే మరిచిపోలేము. దూరం ఎక్కువయ్యే కొద్దీ అనుబంధం మరింత పెరిగినట్లు మన ఊరికి దూరంగా నివసిస్తున్న కొద్దీ మరింత గుర్తుకొస్తుంటుంది. మీ ఊరంటే మీకెందుకింత ఇష్టమో తోటి పాఠకులతో పంచుకోండి. మీ ఊళ్ళో చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి పనులూ, అప్పటి నేస్తాలూ, ఆడుకున్న ఆటలూ, ఆటల్లో తగాదాలూ, పంతాలూ, పండుగ రోజులూ, హైస్కూల్లో అల్లరి సంఘటనలూ... ఏమైనా వ్రాయండి. ఒక్క పేజీ మించకుండా ఉంటే బావుంటుంది. అప్పటి ఫోటోలు కూడా పంపిస్తే మీ వ్యాసం మరింత అందంగా వుంటుంది. ఈ విశాల ప్రపంచంలో ఇంకెక్కడో ఉన్న మన ఊరి నేస్తాలు మనల్ని మళ్ళీ పలకరిస్తారేమో చూడండి! మన ఊరి జ్ఞాపకాలతో బాటు ప్రస్తుతం మీరేం చేస్తున్నారో, ఎక్కడున్నారో కూడా వ్రాయడం మరువకండి... ! !

తల్లి కడుపులోనుండి బయటపడ్డాక ఇల్లు, ఇంట్లోంచి బయటపడ్డాక ఊరు మనిషిని ఆహ్వానిస్తుంది. అలా నన్ను ఆహ్వానించిన ఊరు పెద్దగొపతి (ఖమ్మం జిల్లా). నోరు విప్పి పిలవలేని నేల, మారు పలకలేని గుడి, గుడి మంటపాలు, ఆకలికి అన్నం ఎలాగో మనిషి అభివృద్ధికి చదువు అలాంటిదని అప్పటి వయస్సుకీ అర్థం అయ్యేలా బోధపరచి చదువు చెప్పిన బడి, బడిలోని గురువులు, ఆకలిని మరిపింపచేసి ఆడించే గ్రంధలయం అవరణ, సాగర్ కాలువలో ఈతలు, పంటకొచ్చిన వరికోతలు, కుప్ప నూర్పిళ్ళూ, ధాన్యం బస్తాలమీద ఎక్కి ఇంటికి రావడం, పండుగలకి ముస్తాబయ్యే మా ఊరు. కొన్ని లక్షల క్షణాల జ్ఞాపకాలను నా మస్తిష్కంలో నిక్షిప్తం చేసిన ఊరంటే నా కిష్టం.